భోపాల్: ఠాకూర్ మహిళలను కించపర్చేలా తన క్యాబినెట్ సహచరుడు బిసాహులాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. మహిళల గౌరవానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. తాను మంత్రి బిసాహులాల్ను పిలిపించి గట్టిగా హెచ్చరించానని, దాంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారని శివరాజ్‌సింగ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ ఈ నెల 24న ఓ సభలో మాట్లాడుతూ.. ఠాకూర్ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఠాకూర్‌లతోపాటు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వారు తమ మహిళలను సమాజంలోకి రానీయరని, వాళ్లను ఇండ్లకే పరిమితం చేస్తారని బిసాహులాల్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగక మహిళల్లో సమానత్వం రావాలంటే అగ్రవర్ణ మహిళలను ఇండ్ల నుంచి బయటికి లాక్కోచ్చి సమాజంలో పనిచేయించాలని నోరు జారారు.
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ బిసాహులాల్ను పిలిపించుకుని చీవాట్లు పెట్టారు. దాంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘నాకు మహిళలంటే చాలా గౌరవం. నా వ్యాఖ్యల ఉద్దేశం వేరు. కానీ సమాజంలో తప్పుగా ప్రచారమైంది. ఏదేమైనా నా వ్యాఖ్యలవల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి’ అని మంత్రి బిసాహులాల్ కోరారు.
"I apologize if anyone's sentiments got hurt, I have always respected women," says Madhya Pradesh Cabinet Minister Bisahulal Singh on his 'Thakur women' statement https://t.co/GBQ1ddY3Zi pic.twitter.com/YXXbpvvRlW
— ANI (@ANI) November 28, 2021