Minister Sanjay Singh | లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆశ్చర్యకరమైన వాదనతో పౌరులను అవాక్కయ్యేలా చేశారు. క్యాన్సర్ రోగులు గోశాలలను శుభ్రం చేయడం ద్వారా, అందులో ఉండటం ద్వారా రోగాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి సంజయ్ సింగ్ గాంగ్వార్ పేర్కొన్నారు.
ఆదివారం గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోశాలల్లో ఉంటూ గోవులను సేవ చేస్తే రక్తపోటుకు వాడే మందుల అవసరం 10 రోజుల్లోనే సగానికి తగ్గిపోతుందని అన్నారు. అలాగే ప్రజలు తమ వివాహ వార్షికోత్సవాలు, తమ పిల్లల పుట్టినరోజు వేడుకలను గోశాలల్లో జరుపుకోవాలని ఆయన సూచించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గోశాలలను శుభ్రం చేస్తూ అక్కడే ఉంటే అది పూర్తిగా నయమవుతుందని అన్నారు. అలాగే పేడతో తయారు చేసిన పిడకలు కాలిస్తే దోమలు దూరమవుతాయన్నారు.