హుబ్బళి: కల్తీ కారణంగా తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయ్యిందని వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. లడ్డూ కలీ ్త అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనికొక తార్కిక ముగింపును ఇస్తామని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. హుబ్బళిలో శనివారం ఆయన మాట్లాడుతూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యి వాడకాన్ని నిలిపివేసిన అనంతరం టీటీడీపై ఆరోపణలు వచ్చాయని తెలిపారు. నెయ్యి కల్తీపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు.
ఈ ఏడాది జనవరిలో అయోధ్య దేవాలయ ప్రతిష్ఠ ఉత్సవంలో భక్తులకు తిరుపతి లడ్డూలనే ప్రసాదంగా పంపిణీ చేసినట్టు ఆ ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. మరోవైపు కల్తీ నెయ్యికి సంబంధించిన వివాదంలో తమ కంపెనీని లాగడం పట్ల గుజరాత్‌కు చెందిన అమూల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో తాము సరఫరా చేసిన నెయ్యిని వాడినట్టు ప్రచారం జరగడాన్ని ఖండిస్తూ దీనిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.