ముంబయి, నవంబర్ 1: విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమ బాట పట్టిన మరాఠీలు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కుంబీ సర్టిఫికెట్లు ఇస్తామని, మరాఠ్వాడా ప్రాంతంలో రిజర్వేషన్లు అమలుజేస్తామంటూ ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఆందోళనలు కొనసాగాయి. ఐదు జిల్లాల్లో బస్ సర్వీసుల్ని, బీడ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే, రిజర్వేషన్లపై నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. బుధవారం దక్షిణ ముంబయిలో మంత్రి హసన్ ముష్రిఫ్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయం’ వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గేటుకు అడ్డంగా కూర్చొని ఎవ్వరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సచివాలయం గేటుకు తాళం వేసేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రిజర్వేషన్లపై చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రిజర్వేష్లన్ల ఉద్యయం తీవ్రరూపం దాల్చటంతో సీఎం ఏక్నాథ్ షిండే బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. మనోజ్ జరాంగే తన ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసింది. అయితే, దీక్షను విరమించడానికి జరాంగె నిరాకరించారు. బుధవారం సాయంత్రం నుంచి మంచినీళ్లు కూడా తీసుకోవటం ఆపేస్తున్నట్టు ప్రకటించారు.