Delhi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించడం, దానిని ఆమె కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపడంతో ఈ ఊహాగానాలు మరింత అధికమయ్యాయి. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత కొన్ని నెలలుగా జైలులో ఉండటంతో అభివృద్ధి కుంటుపడింది.
పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి జైలులో ఉండటం, సీఎం బాధ్యతలు ఎవరకీ అప్పగించకపోవడంతో ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం నెలకొంది’ అంటూ బీజేపీ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. కాగా, బీజేపీ ఆరోపణలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడుతున్నది. కమలం పార్టీ కనుసన్నల్లో రాష్ట్రపతి పనిచేస్తున్నారని ఆరోపించింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దొడ్డిదారిన కుట్ర పన్నుతున్నదని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ మంగళవారం ఆరోపించారు. ఒక వేళ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వం పడగొడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లను గెల్చుకుంటుందని, ఢిల్లీ ప్రజలు బీజేపీకి సున్నా సీట్లతో బుద్ధి చెబుతారని అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్ రాష్ర్టాల్లో చేసిన విధంగా ఆపరేషన్ లోటస్ ద్వారా విపక్ష రాష్ర్టాలను అధికారంలోంచి దించేయడమే బీజేపీ పని అని ఆతిశీ విమర్శించారు. అయితే ఇదే మంత్రాన్ని బీజేపీ ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను తస్కరించడానికి ప్రయోగించి విఫలయ్యిందని ఆమె అన్నారు.