న్యూఢిల్లీ, ఆగస్టు 16: న్యాయస్థానాల్లో మహిళలపై లింగ వివక్ష చూపేలా ఉన్న పదాల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. విచారణ, తీర్పులు ఇతరత్రా న్యాయపరమైన సంభాషణల సందర్భాల్లో మహిళలను ప్రస్తావించే సమయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న పలు పదాలకు ప్రత్యామ్నాయ పద సంపుటితో కూడిన ‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బుధవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు మహిళలను ఉద్దేశించి కోర్టుల్లో వినియోగిస్తున్న పదాలను కూడా ఇందులో ప్రస్తావించారు.
ఇకపై న్యాయమూర్తులు, లాయర్లు, ఇతర న్యాయ సమాజానికి చెందిన సభ్యులు ఈవ్ టీజింగ్ స్థానంలో స్ట్రీట్ సెక్సువల్ హెరాజ్‌మెంట్ అని, ప్రాస్టిట్యూట్ అని కాకుండా సెక్స్ వర్కర్ అని వాడాలని హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్నారు. ఇంటి ఇల్లాలిని హౌజ్‌వైఫ్ అని కాకుండా హోమ్‌మేకర్ అని.. ఇలా పలు పదాల స్థానంలో కొత్తవాటిని ఉచ్చరించాలని, ఆదేశాల్లో వాడాలని, తీర్పుల్లో రాయాలని అందులో సూచించారు.