MIG 21 Retires | భారత వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. మిగ్-21 యుద్ధ విమానాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఫ్లీట్ నుంచి తొలగించనున్నది. మిగ్-21 జెట్లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారిని పాంథర్స్గా పిలుస్తంటారు. ప్రస్తుతం ఇవి రాజస్థాన్‌లోని నల్ ఎయిర్‌బేస్‌లో ఉన్నాయి. ఈ మిగ్-21 విమానాల స్థానంలో ఎల్సీఏ మార్క్1ఏ విమానాలతో భర్తీ చేయనున్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికార వర్గాలు తెలిపాయి. మిగ్ 21 భారత్ తొలి సూపర్సోనిక్ యుద్ధ విమానం. దీన్ని 1963లో భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.
ఈ విమానం 1960 నుంచి 70 సంవత్సరాల్లో సాంకేతికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద మిగ్ 21 అనేక మోడల్స్ ఉన్నాయి. 1965 ఇండో-పాక్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో మిగ్ 21 యుద్ధ విమానాలు కీలకపాత్ర పోషించాయి. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ యుద్ధ విమానాన్నే నడిపిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ మిగ్ 21 సేవలు అందించాయని అధికార వర్గాలు తెలిపాయి. మిగ్-21ని రష్యా నుంచి భారత్ తీసుకువచ్చింది. ప్రభుత్వం 874 మిగ్-21లను కొనుగోలు చేసింది.
ప్రపంచంలోని దాదాపు అరవై దేశాలు తమ ఫ్లీట్‌లో మిగ్ 21 యుద్ధ విమానాలను చేర్చుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో మిగ్-21 విమానాలు కూలిపోయిన విషయం తెలిసిందే. దాంతో క్రమంలో ఈ విమానాలను వెనక్కి తీసుకోవాలనే చర్చ మొదలైంది. భారత వైమానిక దళంలో మిగ్-21 చాలా సుదీర్ఘకాలం పాటు సేవలందించిందని, 1965 నుంచి ప్రతి సైనిక ఆపరేషన్‌లో పాల్గొందని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌లో చండీగఢ్‌లో జరిగే కార్యక్రమంలో వైమానిక దళం బైసన్ మిగ్ 21 విమానాలకు వీడ్కోలు పలుకనున్నది. ఈ కార్యక్రమానికి సీనియర్ వైమానిక దళ అధికారులు హాజరవుతారని సంబంధిత వర్గాలు వివరించాయి.