Shubhanshu Shukla : ఆరు దశాబ్దాలకుపైగా భారత వాయుసేనలో సేవలందించిన, ఎన్నో యుద్ధాల్లో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన మిగ్-21 (MiG-21).. సేవలు ఇవాళ్టితో ముగిశాయి. శుక్రవారం ఉదయం వాయుసేన చీఫ్ (Air Chief Marshal) ఏపీ సింగ్ (AP Singh) మిగ్-21 ఫైటర్ జెట్‌కు వీడ్కోలు పలికారు. చండీగఢ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) మాట్లాడుతూ.. తనకు మిగ్-21తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘తన జీవితకాలంలో ఎక్కువగా మిగ్-21 విమానాల్లోనే గడిపానని శుభాంశు శుక్లా తెలిపారు. తాను 2007 నుంచి 2017 మధ్య మిగ్-21 ఫైటర్ జెట్‌ను నడిపానని చెప్పారు. మిగ్-21 కాక్ పిట్ తనకు అతిపెద్ద గురువని, అది నాకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు. ఇవాళ మిగ్-21 కాక్‌పిట్‌లో కూర్చోవాలని భావించానని, కానీ తగినంత సమయం లేకపోవడంతో అది కుదరలేదని అన్నారు. మిగ్-21 యుద్ధ విమానం నడుపటం తనకు గొప్ప అనుభూతి అని తెలిపారు.
‘నా జీవితంలో ఎక్కువభాగం మిగ్-21లోనే గడిపా. మిగ్-21 కాక్‌పిట్ నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇవాళ కాక్‌పిట్‌లో కూర్చొని ఎగరాలనుకున్నా. కానీ తగినంత సమయం లేకపోవడంవల్ల అది సాధ్యం కాలేదు. మిగ్-21ను మళ్లీ చూడడం, నా ప్రయాణంలో భాగమైన ప్రతిఒక్కరినీ కలవడం సంతోషంగా ఉంది. మొదట నేను MiG-21 క్యాలిబర్ వేరియంట్లను, తర్వాత MiG-21 బైసన్‌ను నడిపా. చాలా స్క్వాడ్రన్లలో కూడా ఉన్నా. ఎన్నో యుద్ధాలలో భారత్‌కు విజయాన్ని అందించిన మిగ్-21ని నడపడం చాలా గొప్ప అనుభవం’ అని శుక్లా చెప్పారు.