Layoff | హైదరాబాద్, జనవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఏఐ) రాక, ఖర్చులను తగ్గించుకోవాలన్న ఉద్దేశం, మాంద్యం భయాలు వెరసి కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతున్నది. రానున్న ఐదేండ్లలో తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగించనున్నట్టు 41 శాతం కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఓ నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఏఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. కాగా, 2025లోనూ ఉద్యోగాల కోత ఉంటుందని ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. ఐటీ, మీడియా, ఫైనాన్స్, తయారీ, రిటైల్ తదితర రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉండనున్నట్టు నివేదికలు చెప్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ (సాఫ్ట్వేర్): కొత్త నైపుణ్యాలను ప్రదర్శించని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. 2,28,000 మంది సంస్థలో పనిచేస్తుండగా 1 శాతం మందిని ఇంటికి పంపించనున్నట్టు వెల్లడించింది.
అమెజాన్ (ఈ-కామర్స్): మేనేజ్మెంట్ స్థాయిల్లోని 14 వేల మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. ఏఐ టూల్స్ వినియోగాన్ని పెంచనున్నట్టు తెలిపింది. బోయింగ్, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్టు ప్రకటించాయి.
బ్లాక్‌రాక్ (ఇన్వెస్ట్మెంట్): వ్యూహాత్మక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని 200 మందికి పింక్ స్లిప్ ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఏఐతో ఆ స్థానాలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
బ్రిడ్జ్‌వాటర్ (ఇన్వెస్ట్మెంట్): పొదుపు చర్యల్లో భాగంగా మొత్తం స్టాఫ్‌లో 7 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది.
వాషింగ్టన్ పోస్ట్ (మీడియా): కరోనా సంక్షోభం కారణంగా ఖర్చులతో పాటు నష్టాలను తగ్గించుకోవడానికి తమ స్టాఫ్‌లో 4 శాతం మందిని తొలగిస్తున్నది.
అసోసియేటెడ్ పోస్ట్ (మీడియా): నష్టాలను తగ్గించుకోవడానికి 8 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది.
యాలీ (ఫైనాన్స్): తమ సంస్థలోని మొత్తం 11 వేల మంది ఉద్యోగుల్లో 500 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీ భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలోఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.