Metro Charges | బెంగళూరు, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రోజుకో ధరల పిడుగుతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ప్రజలపై ఎడాపెడా చార్జీల మోత మోగిస్తున్నది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు 15 శాతం పెంచగా.. తాజాగా బెంగళూరు మెట్రో రైలు చార్జీలను ఏకంగా 50 శాతం పెంచారు. అంతేకాకుండా ఓలా, ఉబర్ తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్‌లో వేర్వేరు చార్జీలు విధిస్తున్నట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) శనివారం ప్రకటించింది.
పెంచిన చార్జీలు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. గరిష్ఠ చార్జీ 60 నుంచి 90 రూపాయలకు, మినిమమ్ బ్యాలన్స్‌ను 50 నుంచి 90 రూపాయలకు పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం 0-2 కిలోమీటర్లకు రూ.10, 2-4కు రూ.20, 4-6కు రూ.30, 6-8కు రూ.40, 8-10కు రూ.50, 10-12కు రూ.60, 15-20కు రూ.70, 20-25 కు రూ.80, 25-30 కిలోమీటర్లు, ఆపై దూరానికి రూ.90 వసూలు చేస్తారు. చార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు వీటిని పెంచినట్టు బీఎంఆర్సీఎల్ తెలిపింది.
తాగునీటి చార్జీలను కూడా త్వరలోనే పెంచుతామని ఇటీవల పేర్కొన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నీ ఉచితంగా ఇవ్వాలంటే ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా ప్రజలు ఆయన తీరును తీవ్రంగా దుయ్యబడుతున్నారు. అధికారంలోకి రావడానికి పలు పథకాలను మీరే ఉచితంగా ఇస్తామని ప్రకటించారని, ప్రజలెవ్వరూ ఉచిత బస్ లాంటి పథకాలు కావాలని కోరలేదని వారు అంటున్నారు. అలాగే ఉచిత విద్యుత్‌ను తాము అడగలేదని, మీ అధికార దాహం కోసం వాటిని ప్రకటించి, ఇప్పుడు ప్రజలపై నెపం వేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.