న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) గురించి జరుగుతున్న భారీ ప్రచార ఆర్భాటం నెమ్మదిగా చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నది. ఏఐ ఇంజినీర్లు, పరిశోధకులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. నిరుడు ఏఐ టాలెంట్‌ను భారీ వేతనాలిచ్చి నియమించుకున్న మెటా తాజాగా విస్తరణకు బదులు కుదింపు గురించి మాట్లాడుతుండటమే దీనికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం ఓపెన్ఏఐ తన జీపీటీ-5ను ఎలాంటి ఆర్భాటం లేకుండా విడుదల చేసింది. అదేవిధంగా మరికొన్ని టెక్ కంపెనీలు తమ ఏఐ ఆకాంక్షలను కుదించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏఐపై మోజు సన్నగిల్లుతున్నదా? అనే భావన కలుగుతున్నది.
మెటా ఏఐ డివిజన్ చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ రాసిన ఇంటర్నల్ నోట్లో, ఈ ఏఐ డివిజన్‌కు మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ లాబ్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. దీనిని నాలుగు బృందాలుగా విభజిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ వివరణను ఉద్యోగులు నమ్మడం లేదు. కొందరు ఏఐ ఇంజినీర్లను తొలగించేందుకు లేదా సిబ్బందిని ఏఐ వర్క్ఫోర్స్లోనే అటు, ఇటు మార్చేందుకు మెటా పరిశీలిస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’కథనం పేర్కొంది. కొందరు ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో అస్థిరత్వ భావనకు మరింత ఆజ్యం తోడైంది. గతంలో ఆర్భాటంగా, భారీ ప్రచారం పొందిన బ్లాక్‌చైన్ లేదా మెటావెర్స్ వంటి టెక్నాలజీల మాదిరిగానే ఏఐ కూడా ఆ బాటలోనే పయనిస్తున్నదా? అనే భావన కలుగుతున్నది.