న్యూఢిల్లీ, మే 20: కృత్రిమ మేధ (ఏఐ) ఆధిపత్యం చెలాయించే యుగానికి టెక్ దిగ్గజం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ మొత్తం ఉద్యోగులలో సుమారు 10 శాతం మంది అంటే సుమారు 8,000 మందిని మే 20న తొలగించనున్నట్లు మెటా ఉద్యోగులకు ఏప్రిల్‌లో సమాచారం అందింది. ఈ ఉత్తర్వుల అమలు సింగపూర్‌లో ప్రారంభమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు (స్థానిక కాలమానం) మీ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు మెటా ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. బ్రిటన్, అమెరికా, తదితర దేశాలలోని ఉద్యోగులకు కూడా బుధవారం తెల్లవారుజామున వారి కాలమానం ప్రకారం ఈమెయిల్స్ వెళ్లాయి. సోమవారం మరో 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ కార్యక్రమాలకు తిరిగి కేటాయించనున్నారని వారికి తెలిసింది. ప్రస్తుతం మనుషులు చేస్తున్న పనులను చేయగల ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేయడమే ఈ కొత్త ఉద్యోగుల లక్ష్యం. మీరు ఇంటి నుంచే పనిచేయాల్సి (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉంటుందని ఈ వారం ప్రారంభంలో మెటా మానవ వనరుల విభాగాధిపతి జెనెల్లె గాలే ఉద్యోగులకు తెలిపారు.
ఏఐ శిక్షణ కోసం తమ డాటాను ట్రాక్ చేసే మెటాకు చెందిన కొత్త ప్రోగ్రామ్‌ను ఆపాలని కోరుతూ కొంతమంది ఉద్యోగులు ఒక వినతిపత్రాన్ని పంచుకుంటూ ఆఫీసు గోడలపై కరపత్రాలను అతికించారని 8 మంది ఉద్యోగులు టైమ్స్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. వారాంతం నాటికి తమ ఉద్యోగాలు పోతాయేమోనని భయపడి కొందరు కార్మికులు సోమవారం కార్యాలయాల్లో ఉచిత స్నాక్స్, ల్యాప్‌టాప్ చార్జర్ల కోసం వెతికారని తమ పేర్లను వెల్లడించడానికి నిరాకరించిన ఉద్యోగులు తెలిపినట్లు టైమ్స్ కథనం పేర్కొన్నది. ఏఐ యుగంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంటున్న కంపెనీల వైఖరిని మెటా తీసుకున్న నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయి. అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగ కోతలను ప్రకటించడం ప్రారంభించాయి. దీంతో ఉద్యోగులలో భయాందోళనలు నెలకొంటున్నాయి. అమెజాన్, కాగ్నిజెంట్, ఒరాకిల్, లింక్డ్ఇన్ వంటి కొన్ని పెద్ద కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగించాయి.