Satadru Dutta : అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన వేళ కోల్‌కతా స్టేడియం (Kolkata stadium) లో శనివారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అరెస్టయిన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా (Satadru Dutta) బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు నిరాకరించింది. పోలీసులు అతడిని 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా మెస్సీ తొలుత కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో షెడ్యూల్లో పేర్కొన్న దానికంటే తక్కువ సమయం గడపడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలోని సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను మైదానంలోకి విసిరేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రును పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్టుచేశారు. ఈవెంట్‌ను సరిగా నిర్వహించకుండా గందరగోళానికి కారణమయ్యాడనే కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
శతద్రును అరెస్టు చేసిన అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ 14 రోజుల కస్టడీకి అప్పగించింది. ఈవెంట్ ప్రణాళిక, అనుమతులు, కార్యచరణ నిర్ణయాలపై పోలీసులు అతడిని విచారించే అవకాశం ఉంది. అతడిని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో బీజేపీ నేతలు నినాదాలు చేశారు.
ఇదిలావుంటే ఉద్రిక్తతలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ స్టేడియంను, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించింది. తదుపరి విచారణ చేస్తోంది.