పుణె, సెప్టెంబర్ 18: లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకపోవటానికి ఉత్తర భారత మనస్తత్వమే కారణమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ విమర్శించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర భారతం, పార్లమెంట్‌కు ఇప్పటికీ మనస్సు అంగీకరించడం లేదని అన్నారు. పుణె డాక్టర్ అసోసియేషన్ శనివారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన పవార్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. మహిళా నాయకత్వాన్ని అంగీకరించడానికి దేశం ఇప్పటికీ మానసికంగా సిద్ధంగా లేదని దీన్ని బట్టి తెలుస్తున్నదని చెప్పారు. తాను కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న నాటి నుంచి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, తమ పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు కూడా లేచి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఈ బిల్లు ఆమోదం పొందే వరకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు.