Menstrual Hygiene | పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ దాఖలైన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. 6 నుంచి 12వ తరగతి బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందించడంతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై మరోసారి జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. రుతుస్రావ పరిశుభ్రత నిర్వహణపై జాతీయ ఏకరీతి విధానాన్ని తీసుకురావాలని, ఈ మేరకు రాష్ట్రాలతో చర్చలు జరపాలని గతంలో కోర్టు ఆదేశించింది.
ఇందు కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయంతో జాతీయ విధానాన్ని రూపొందించడానికి సంబంధించిన సంబంధిత డేటాను సేకరించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) కార్యదర్శిని నోడల్ అధికారిగా సుప్రీంకోర్టు నియమించింది. అయితే, కేంద్రానికి ఇప్పటి వరకు సమాధానాలు ఇవ్వని రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాలు మాత్రమే స్పందించాయని, మిగతా వాటి ఎలాంటి స్పందన లేదని ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, ఆయా రాష్ట్రాలకు ఆగస్ట్ 31 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఆ లోగా స్పందించడంలో విఫలమైతే కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకోచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు నోటీసులు ఇవ్వనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.