Supreme Court : మహిళల ఆరోగ్యానికి సంబంధించి నెలసరి పరిశుభ్రత (మెనుస్ట్రువల్ హైజీన్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని, స్కూళ్లలో విద్యార్థినిల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. స్కూళ్లలో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని, ప్రత్యేక టాయిలెట్లు ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ విచారించి తాజా సూచనలు చేసింది.
ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కే. పాఠశాలల్లోని విద్యార్థినులకు స్కూళ్లలో పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలి. విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ అందించడాన్ని దాతృత్వంలాగా చూడకూడదు. అలాగే విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ద్వారానో అమలు చేయకూడదు. ఇది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుగా చూడాలి. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ఆదేశాలు పాటించాలి. ఒకవేళ ఇలా వేర్వేరు టాయిలెట్లు లేకపోతే గుర్తింపు రద్దు చేయొచ్చు. విద్యార్థినుల హక్కులను పాటించకపోతే అది ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది.
బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అందించడంలో విఫలమైతే ప్రభుత్వానిదే బాధ్యత. స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేకపోతే బాలికల ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కూళ్లలో శానటిరీ ప్యాడ్స్ అడగడానికి విద్యార్థినులు సంకోచించకూడదు. అలాగే.. టీచర్లు వారికి ఇవ్వాలని ఉన్నా వనరుల సమస్య ఉండకూడదు. సరైన, నాణ్యమైన, ప్రభావవంతమైన నెలసరి పారిశుధ్యాన్ని పాటిస్తే అది ఆడపిల్లల ఆరోగ్యానికి, మంచి చదువుకు కూడా దోహద పడుతుంది’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.