Meghalaya | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఆధిక్యం మారుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అందులో ఎపీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాలని పట్టుదలతో ఉన్న టీఎంసీ 14 చోట్ల లీడ్లో ఉన్నది. ఇక బీజేపీ 5, కాంగ్రెస్ 8, ఇతరులు 18 చోట్ల ఆధిక్యంలో నిలిచారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకం కానున్నది. కాగా, మేఘాలయలో పోటీ తీవ్రంగా ఉంటుందని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అయిన ఎన్పీపీ ఆధిక్యతను నిలబెట్టుకున్నప్పటికీ, వేరుగా పోటీ చేసిన తాజా మాజీ మిత్రుడైన బీజేపీతో పొత్తుపెట్టుకోనట్లయితే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కోల్పోయే అవకాశం ఉన్నది.