న్యూఢిల్లీ: ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి మహిళా జడ్జిని బెదిరించాడు. (Man threatens Woman judge) ‘బయటకు రా.. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించాడు. ఈ సంఘటన వల్ల మానసిక వేదనకు గురైన తాను ఒక దశలో రాజీనామా చేయాలని భావించినట్లు ఆ మహిళా న్యాయమూర్తి వాపోయారు. ఆ వ్యక్తితోపాటు అతడి తరుపు న్యాయవాదిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 2న మహిళా న్యాయమూర్తి శివంగి మంగ్లా ఒక చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇచ్చారు. సంబంధిత చట్టం కింద నిందితుడైన వ్యక్తిని దోషిగా నిర్ధారించారు.
కాగా, తీర్పు విన్న ఆ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక వస్తువును జడ్జిపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. తీర్పును సవాల్ చేసేందుకు ఏదైనా చేయాలని అతడి తరుఫు న్యాయవాదితో అన్నాడు. ఆ తర్వాత మహిళా న్యాయమూర్తిని అతడు బెదిరించాడు. ‘బయట కలుద్దాం. సజీవంగా ఇంటికి తిరిగి ఎలా వెళ్తారో చూద్దాం’ అని హెచ్చరించాడు.
మరోవైపు ఆ రోజున కోర్టులో నిందితుడు, అతడి తరుఫు న్యాయవాది అతుల్ కుమార్ తనను బెదిరించడమే కాకుండా, తన పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారని మహిళా న్యాయమూర్తి శివంగి మంగ్లా ఆరోపించారు. వారి ప్రవర్తనతో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ వారిద్దరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఈ ప్రవర్తనపై క్రిమినల్ ధిక్కార విచారణ కోసం ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు రిఫర్ చేయకూడదో వివరించాలని కోరుతూ దోషి తరుఫు లాయర్ అతుల్ కుమార్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణ తేదీలోగా లిఖితపూర్వకంగా స్పందన తెలియజేయాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు.