Anmol | చండీగఢ్: హర్యానాకు చెందిన రూ.23 కోట్ల విలువైన దున్నపోతు దేశంలో జరిగే వ్యవసాయ ప్రదర్శనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. 1,500 కిలోల బరువుండే అన్మోల్ పేరు గల ఈ దున్న తన ఉత్తమ జాతికి, భారీ కాయానికి, పునరుత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. విలాసవంతమైన జీవన శైలి కలిగిన ఈ దున్న రోజువారీ ఆహారం ఖర్చు సుమారు రూ.1500. ఇది రోజూ పావు కిలో బాదం, 30 అరటి పండ్లు, నాలుగు కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు లాగించేస్తుంది.
రోజూ బాదం నూనె, ఆవ నూనెతో శరీరాన్ని మర్దన చేయడంతో ఇది ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దున్నను పోషించడం కోసం దీని యజమాని గిల్ రోజుకు 25 లీటర్ల పాలిచ్చే దీని తల్లిని, సోదరిని అమ్మేశారు. ఆకట్టుకొనే ఆకారం, ఆహారం తీసుకొనే ఈ దున్నపోతు వీర్యానికి భారీగా డిమాండ్ ఉంది. వారానికి రెండు సార్లు దీని వీర్యాన్ని సేకరిస్తారు. దీని ద్వారా నెలకు 5 లక్షల వరకు ఆదాయం వస్తుంది.