Meerut murder : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారి అయిన తన భర్తను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి, అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి చంపేసింది. అనంతరం భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసి ఆ ముక్కలను ఓ డ్రమ్ములో పెట్టి సిమెంటులో సీల్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితురాలిని ఆమె కన్న తల్లిదండ్రులు కూడా అసహ్యించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ మర్చంట్ నేవీ అధికారి. 2016లో ఆయన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2019లో వారికి ఒక పాప జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్.. సాహిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సౌరభ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆఖరికి ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ తన ఆరేళ్ల కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సౌరభ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
వాస్తవానికి ముస్కాన్‌తో వివాహం అనంతరం సౌరభ్ రాజ్‌పుత్.. ఆమెతో ఎక్కువ సమయం గడుపడం కోసం మర్చంట్ నేవీలో ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. భార్యతో కలిసి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ముస్కాన్ అత్తవారి ఇంట్లో గొడవలు సృష్టించింది. సౌరభ్‌ను అతడి కుటుంబం నుంచి వేరు చేసింది. ఆ తర్వాత సాహిల్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు కలిసి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. భర్తకు తెలిసి వారించినా పట్టించుకోలేదు. అయినా ఆమెను అమితంగా ప్రేమించే సౌరభ్ మెల్లగా నచ్చజెప్పుకుని మార్చుకోవాలని ప్రయత్నించాడు.
విడాకులు ఇస్తానని హెచ్చరించాడు. అయినా ముస్కాన్ వెనక్కి తగ్గకపోవడంతో అతనే తగ్గాడు. అనంతరం గొడవలు సద్దుమణుగుతాయనే ఉద్దేశంతో తిరిగి మర్చంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ రీత్యా లండన్‌కు వెళ్లాడు. ఫిబ్రవరి 28న తన కుమార్తె పుట్టినరోజు ఉండటంతో భారత్‌కు వచ్చాడు. వారం రోజులు ఇక్కడే ఉండిపోదామని భావించాడు. ఈ క్రమంలో మార్చి 4న రాత్రి సౌరభ్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడు సాహిల్‌ను పిలిచి హత్యకు పాల్పడింది.
అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి, డ్రమ్ములో సీల్ చేసింది. తర్వాత ఎవరికీ తనపై అనుమానం రావద్దనే ఉద్దేశంతో సౌరభ్ ఫోన్ తీసుకుని మనాలీ హిల్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ సౌరభ్ ఫోన్‌తో ఫొటోలు తీసింది. అది చూసి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేసినా బదులివ్వలేదు. దాంతో అనుమానం వచ్చిన సౌరభ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ముస్కాన్ హిల్‌స్టేషన్ నుంచి పుట్టింటికి వెళ్లింది. సౌరభ్‌ను హత్య చేసిన విషయం చెప్పింది. దాంతో ఆమె పేరెంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చి కూతురును పట్టించారు.
ఈ నేపథ్యంలో మీడియా ముస్కాన్ తల్లిదండ్రును ప్రశ్నించగా.. తమ బిడ్డ చేసింది క్షమించరాని నేరమని అన్నారు. సౌరభ్ ఆమెను గుడ్డిగా ప్రేమించాడని, ఆమె ఏది అడిగినా కాదనే వాడు కాదని చెప్పారు. ఆమె కోసం ఉద్యోగం వదిలేశాడని, కుటుంబాన్ని వదిలేశాడని తెలిపారు. సాహిల్‌తో సంబంధం గురించి తెలిసినా తనను మార్చుకునే ప్రయత్నం చేశాడే తప్ప.. తొందరపడలేదని అన్నారు. ఉద్యోగం కోసం సౌరభ్ లండన్ వెళ్తుంటే ఆయన తిరిగి వచ్చేవరకు ముస్కాన్‌ను తమతో ఉండమని కోరామని, అందుకు ముస్కాన్ నిరాకరించిందని చెప్పారు.
అప్పుడు కూడా ఆమె ఇష్టప్రకారమే ఉండనివ్వండని సౌరభ్.. ముస్కాన్నే సమర్థించాడని ఆమె తల్లిదండ్రులు గుర్తుచేశారు. సౌరభ్ అంత ప్రేమించినా ముస్కాన్‌కు అర్థం కాలేదని, సాహిల్ మాయలో, డ్రగ్స్ ఉచ్చులో పడి కిరాతకంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన మీ కుమార్తెకు ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఉరే సరైన శిక్ష అని చెప్పి కంటతడిపెట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తె సౌరభ్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తాము కూడా సౌరభ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.