Medical Student : పంజాబ్లోని పాటియాలాలో దారుణం జరిగింది. మెడికల్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని కమల్ మిట్టల్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్సా జిల్లాలోని, బరేటాకు చెందిన కమల్ మిట్టల్ పాటియాలాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. న్యూలాల్ బాఘ్ ప్రాంతంలోని ఒక హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కమల్ స్నేహితులు అతడికి ఫోన్ చేశారు.
ఎంతమంది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్లు అతడి హాస్టల్ గదిలోకి వచ్చి చూశారు. వాళ్లు వచ్చేసరికి కమల్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఈ విషయాన్ని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి పరిశీలించగా, అతడి ఒంటిపై మూడు, నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. ముఖ్యంగా మెడమీద పొడవడంతో కమల్ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. అక్కడి సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ఇందులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా, ఒంటిపై రక్తపు మరకలతో వెళ్తుండటాన్ని గమనించారు.
అతడికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కమల్తోపాటు హాస్టల్లో ఉండే మరో నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ఈ హత్య ఘటన స్థానికంగా కలవరం రేపింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ బయట యువత, స్థానికులు భారీగా గుమిగూడి ఆందోళన చేపట్టారు. దీంతో శాంతి భద్రతలు అదుపుతప్పకుండా ఉండేందుకు భద్రతా బలగాల్ని భారీగా మోహరించారు. కేసు విచారణ వేగంగా జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.