గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న బీఆర్డీ వైద్య కళాశాల్లో ఓ విద్యార్థి 2014 నుంచి ఇప్పటి వరకు ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలోనే కొనసాగుతున్నాడు. 2015లో ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 2014 నుంచి యూజీ హాస్టల్లో ఉంటున్నాడు. కానీ పరీక్షల కోసం దరఖాస్తు చేయడం లేదు. తరగతులకు కూడా హాజరుకావడం లేదు. వైద్య విద్య నిబంధనల ప్రకారం ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు మరోసారి ప్రవేశం కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫారంను నింపి, ప్రథమ సంవత్సరంలోనే కొనసాగవచ్చు.
అందువల్ల ఈ విద్యార్థి అడ్మిషన్ సాంకేతికంగా చెల్లుబాటు అవుతున్నది. ఫలితంగా అతని అడ్మిషన్‌ను కళాశాల యాజమాన్యం రద్దు చేయలేకపోతున్నది. ఆ విద్యార్థికి కళాశాల యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేదు. అతని తండ్రికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కుమార్ జైస్వాల్ కార్యాలయం నుంచి మూడుసార్లు ఫోన్ చేశారు. ఆయన కూడా తన కుమారుడి కోసం కళాశాలకు రావడం లేదు. కళాశాల అధికారులు మాట్లాడుతూ, ఈ విద్యార్థి మెస్ ఫీజు కూడా చెల్లించడం లేదని, ఉచిత లాడ్జింగ్, బోర్డింగ్ సేవలను పొందుతున్నాడని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను కోరినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.