న్యూఢిల్లీ, అక్టోబర్ 20: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ‘నేషనల్ మెడికల్ కమిషన్’ (ఎన్ఎంసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సుల అడ్మిషన్ తుది గడువు సెప్టెంబర్ 30తో ముగిసిందని, కటాఫ్ తేదీ తర్వాత జరిగిన అడ్మిషన్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్ఎంసీ శుక్రవారం ఓ నోటీస్ విడుదల చేసింది.
దీంతో దేశవ్యాప్తంగా 400 మందికిపైగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరికి కేటాయించిన సీట్లు చెల్లుబాటు కావని ఎన్ఎంసీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలా ఉండగా, ఎంబీబీఎస్ పాస్ మార్కులను 40శాతానికి తగ్గిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎన్ఎంసీ ఉపసంహరించుకుంది. ఎంబీబీఎస్ కోర్సుల అడ్మిషన్ల కటాఫ్ తేదీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు ఇంతకుముందే సమాచారం ఇచ్చామని ఎన్ఎంసీ పేర్కొన్నది. ఈ కటాఫ్ తేదీ తర్వాత జరిగిన అడ్మిషన్లను వెంటనే డిశ్చార్జ్ చేయాల్సిందేనని ఆదేశించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా వందలాదిగా మెడికల్ సీట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఇంకా కొనసాగిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని ఎన్ఎంసీ తెలిపింది.