LPG Price | న్యూఢిల్లీ, మే 1: కార్మిక దినోత్సవం రోజున ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కార్ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఎటువంటి ఇంధన భారం మోపబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పదేపదే హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్లేట్ ఫిరాయించింది. ప్రజలపై గ్యాస్ పిడుగు వేసింది.
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు టిఫిన్ సెంటర్లు ఉపయోగించే వాణిజ్య సిలిండర్‌పై రికార్డు స్థాయిలో మోయలేని భారం మోపింది. 19 కిలోల సిలిండర్‌పై దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి రూ.993 పెంచేసింది. దీంతో ఢిల్లీలో దాని ధర రూ. 3,071.50కి చేరింది. అలాగే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల ధరలను ఒక్కో బాటిల్‌కు రూ. 549 నుంచి రూ. 810.50కి పెంచింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ (డొమెస్టిక్ ఎల్పీజీ) ధర ప్రస్తుతం రూ. 913 కాగా, 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర దానికంటే కొంచెం తక్కువగా ఉంది. అలాగే టెలికం సిగ్నల్ టవర్లు వంటి పారిశ్రామిక వినియోగదారులు వాడే బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ. 137 నుంచి రూ. 149కి పెరిగింది. పెట్రోల్ పంపుల వద్ద లభించే లీటరు డీజిల్ ధర రూ. 87.62తో పోలిస్తే ఈ ధరలు ఎక్కువ. అంతర్జాతీయ విమానయాన సంస్థల జెట్ ఇంధనం ధరను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది.
5 నెలల్లో రూ.1,491 పెంపు
వాణిజ్య ఎల్పీజీ ధర గడచిన 5 నెలల్లో రికార్డు స్థాయిలో రూ. 1,491 పెరిగింది. మార్చి 1 రూ. 28 పెంచగా మార్చి 7న రూ. 114.5 పెంచారు. తాజాగా రికార్డు స్థాయిలో రూ. 993 పెంచుతున్నట్లు ప్రభుత్వ అధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం నేరుగా వినియోగదారుడిపై పడే అవకాశం అధికంగా ఉంది. కాగా , విమానయాన సంస్థలు, వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల భారాన్ని భరించాలని నిర్ణయించుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల రిటైల్ ధరలు స్థిరంగా ఉండగా అంతర్జాతీయ ధరల అస్థిరత నుండి వినియోగదారులను రక్షించడం, సాధారణ ప్రజలను ప్రభావితం చేసే కీలక ఇంధనాల ధరలలో ఎటువంటి సవరణ జరగలేదని ఐఓసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముడి సరుకుల ఖర్చుల ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తారు.
ఏటీఎఫ్ ధర 5% పెంపు
అంతర్జాతీయ విమానయాన సంస్థల జెట్ ఇంధన ధరలను 5 శాతం పెంచారు. వరుసగా ఇది రెండో నెల పెంపు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకారం భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయానికి నిలయమైన ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరలను కిలోలీటరుకు 76.55 డాలర్లు లేదా 5.33 శాతం పెంచి 511.86 డాలర్లకు చేర్చారు. మొత్తం వినియోగంలో దాదాపు 90 శాతం వాటా ఉన్న పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు యథాతథంగా ఉన్నాయని ఐఓసీ తెలిపింది.
డొమెస్టిక్ ఎల్పీజీ యథాతథం
గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నాయి. మార్చి 7న చివరిసారిగా ధరలను సవరించారు. అప్పుడు 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 60 పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 913గా ఉంది. గత ఏడాది మార్చిలో లీటరుకు రూ. 2 తగ్గించిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్తంభించిపోయాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 94.72 కాగా డీజిల్ ధర లీటరుకు రూ. 87.62గా ఉంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం అంతర్జాతీయ బెంచ్మార్కులు, మారకపు రేట్లకు అనుగుణంగా నెలలవారీగా ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను సవరిస్తాయి.
ఇదీ మోదీ మాడల్! ; ఎన్నికల ముందు ప్రజలను తప్పు దారి పట్టించడం
న్యూఢిల్లీ, మే 1: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను హఠాత్తుగా రూ. 993 పెంచడంపై మోదీ ప్రభుత్వంపై విపక్షాలు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల ముందు ప్రజలను తప్పుదారి పట్టించడం, ఎన్నికలయ్యాక ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరచడం.. ఇదే మోదీ మాడల్ అని విరుచుకుపడ్డాయి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ దెబ్బ తప్పదని తాను ప్రజలను ముందే హెచ్చరించినట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘మొదటి దాడి గ్యాస్‌పై చేశారు. ఇక తర్వాతి దాడి పెట్రోల్, డీజిల్ పైనే’ అని ఆయన అన్నారు. ‘ఈ రోజు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా రూ.993 పెంచారు. ఒక్క రోజు ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. మూడు నెలల కాలంలో సిలిండర్ ధర 81 శాతం పెరిగింది. టీస్టాల్, దాబా, హోటల్ బేకరీ, స్వీట్ షాప్ లాంటి వారితో పాటు ఆ భారం మీ అన్నం కంచం మీద కూడా పడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
కార్మిక దినోత్సవం నాడు మోదీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదని, ఇది ప్రతి సామాన్యుడిని గాయపరుస్తుందని అన్నారు. ఈ భారీ పెరుగుదలతో ఆహారం ధరలు కూడా పెరుగుతాయని, చివరకు ఆ భారమంతా సామాన్యుడిపై పడుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఎన్నికలై పోయిన వెంటనే మోదీ ఆలస్యం చేయకుండా గ్యాస్ ధర పెంచి ప్రజలపై భారం మోపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. కార్మికులకు వేతనాలు పెంచకపోయినా గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ. 3,000 చేశారని, ఇది దేశంలోని లక్షలాది మంది పేదవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీపీఎం నేత బృందా కారత్ పేర్కొన్నారు. మోదీజీ పెద్దయెత్తున సబ్సిడీలు కల్పిస్తారని, అయితే అది అంబానీ, అదానీలకు తప్ప సామాన్యుడికి కాదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం, అవి ముగిసిన వెంటనే వారిని ధరలతో బాదడం మోదీకి అలవాటేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రపంచ వ్యాప్త ధరల పరిణామాలను చూస్తే భారత్‌లో గ్యాస్ ధరల పెంపు మితంగానే ఉందని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సమర్థించారు.
గత ఐదు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు ఇలా..
