గౌహతి: సైన్స్ ఫెస్ట్‌లో చంద్రుడి భారీ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. (Massive Moon Replica) మూన్ పైకి నాసా పంపిన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ భారీ చంద్రుడి ఆకృతిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశంసించారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఐఐటీలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చంద్రుని భారీ ప్రతిరూపం ఎంతో ఆకట్టుకున్నది.
కాగా, ఏడు మీటర్ల వ్యాసం కలిగిన మూన్ నమూనాను బ్రిటిష్ కళాకారుడు ల్యూక్ జెర్రామ్ రూపొందించారు. చంద్రునిపైకి నాసా పంపిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) ద్వారా తీసిన చిత్రాలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. గాలితో నింపిన బెలూన్‌పై భారీ చంద్రుడి ఆకారాన్ని ముద్రించారు. చంద్రుడిపై కొండలు, లోయలు వంటివి కూడా ఎంతో స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ‘ది మ్యూజియం ఆఫ్ మూన్’ పేరుతో ఐఐటీ గౌహతి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన చంద్రుడి భారీ ప్రతిరూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Isro Chief
మరోవైపు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఈ మూన్ ఎగ్జిబిట్‌ను ప్రశంసించారు. ఇలాంటి మోడల్‌ను రూపొందించడానికి కళాకారుల సహకారాన్ని ఇస్రో తీసుకుంటుందని తెలిపారు. చంద్రుడి ఉపరితలానికి చెందిన అరుదైన ఉత్తమ చిత్రాలు భారత్ వద్ద ఉన్నాయని చెప్పారు. మూన్ మోడల్ రూపొందించేందుకు ఎవరైనా కోరితే ఆ ఫొటోలు ఇస్తామని అన్నారు. చంద్రుడిపై ల్యాండింగ్ కోసం ప్రపంచంలోని అంతరిక్ష సంస్థలు ఈ చిత్రాలను వినియోగిస్తున్నాయని వెల్లడించారు.