న్యూఢిల్లీ, జూలై 26: విమర్శలు చేస్తే ఈడీ.. విపక్ష పార్టీలపై ఈడీ.. ఎదురు మాట్లాడితే ఈడీ.. దారికి తెచ్చుకోవాలంటే ఈడీ.. గడిచిన 8 ఏండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడుల్లో అత్యధికం రాజకీయ లక్షిత దాడులనే విమర్శలున్నాయి. ఈడీ కేసులు ఎదుర్కొన్న పలువురు నేతలు బీజేపీలో చేరగానే కేసులు ఎలా అటకెక్కాయో వివరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ‘వాషింగ్‌పౌడర్’ వీడియో ప్రదర్శించి మరీ చూపారు. ప్రధానంగా సీబీఐ, ఈడీ.. నిఘాసంస్థలను తన ప్రయోజనాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం వాడుకుంటున్నదన్న విమర్శలు చాలాఏండ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రతిపక్ష నేతలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల నాయకులే లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఇలా కక్ష సాధింపు చర్యలకు ఉపయోగిస్తున్నదన్న ఆరోపణలు తక్కువేమీ కాదు. తాజాగా నిఘా సంస్థల్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తున్నదని పేర్కొంటూ విపక్షనేతలు నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ కూడా రాశారు. గత ఎనిమిదేండ్లుగా ఈడీ జరిపిన దాడుల తీరునుచూస్తే.. తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నేతల్ని లొంగదీసుకునేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ వాడుకుంటున్న తీరు కండ్లకు కడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
8 ఏండ్లలో 27 రెట్లు పెరిగాయి..
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే ఏకంగా 27 రెట్లు పెరిగాయి. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద గతంలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం దాడులు జరపాల్సి వస్తున్నదంటూ కలరింగ్ ఇచ్చుకుంటున్నారు.