Massive explosion | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆదివారం బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. గుడంబా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బెహ్తా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ కార్మికులను పోలీసులు అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడు ఘటనలో దాదాపు ఏడుగురు మరణించినట్లు సమాచారం. దాదాపు ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ప్రమాదంపై సీఎం ఆదిత్యనాథ్ ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన సరైన చికిత్స అందించాలని సూచించారు.