కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 3: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్గఢ్ అదనపు డీజీపీ వివేకానంద సిన్హా , బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. కిరండూట్ పోలీస్స్టేషన్ పరిధిలోని లోహగావ్, పురంగెల్, ఆంద్రీస్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
బస్తర్ రేంజ్లోనే 153 మంది మృతి
బస్తర్ రేంజ్లో ఈ ఏడాది ఇప్పటివరకు 153 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారని, 669 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, 656 మంది లొంగిపోయారని ఐజీ సుందర్రాజ్ తెలిపారు.