విరుధునగర్, ఏప్రిల్ 19: తమిళనాడులోని విరుధునగర్ జిల్లా కట్టనర్పట్టి గ్రామంలో ఆదివారం ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 18 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఫ్యాక్టరీ లోపల ఫ్యాన్సీ టపాసులకు గొలుసులు అతికించడంలో 30 మంది కార్మికులు నిమగ్నమై ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. పేలుడు ధాటికి భవనంలో కొంత భాగం కూలిపోయింది. గోవిందపల్లూరుకు చెందిన ముత్తు మాణిక్కం అనే వ్యక్తి ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొన్నది.
సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే విరుధునగర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.