CRPF Mass marriage | తమ పట్ల ప్రజల్లో భరోసా కలిగేందుకు సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో 12 జంటలకు సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు జరిపించారు. మెట్టినిళ్లు వారు ఇచ్చినట్లుగానే కట్నకానుకలు ఇచ్చి వారిని అత్తవారింటికి పంపారు. సుక్మాలోని మినీ స్టేడియంలో జరిపిన ఈ కార్యక్రమానికి పలు గ్రామాల ప్రజలు హాజరై సంతోషం వ్యక్తం చేశారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పహారా కాసే ప్రత్యేక భద్రతా దళాలను చూస్తేనే సుక్మా జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల ప్రజలు భయపడుతుంటారు. అలాంటి వారిలో తమ పట్ల భయం కోల్పోయి భరోసా కల్పిస్తున్నామన్న నమ్మకం కలిగించేందుకు సీఆర్పీఎఫ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సుక్మా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 12 జంటలకు వారు కోరుకున్నట్లుగా సంప్రదాయంగా పెండ్లిళ్లు జరిపించారు. కొత్త దంపతులకు జీవిత బీమా సౌకర్యం కల్పించి అదే వేదికపైన బాండ్లు అందజేశారు. అలాగే నగదు, ఇతర కానుకలు కూడా వారికి అందించారు. ఈ సామూహిక వివాహాల్లో కొందరు జవాన్లు వధువులకు సోదరులుగా.. మరికొందరు వరుడి తరఫు వారిగా వ్యవహరించి ఘనంగా పెండ్లిళ్లు జరిపించారు. అనంతరం అంతా కలిసి విందు ఆరగించారు.
సీఆర్పీఎఫ్ 74 కార్ప్స్ కమాండెంట్ డీఎన్ యాదవ్ నూతన వధూవరులను సత్కరించారు. ఒక్కో జంటకు కట్నంగా రూ.1,100 నగదుతోపాటు చీరలను బహుమతిగా అందించి ఆశీర్వదించారు. రెండో బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సామూహిక వివాహాలు శుభపరిణామమని జిల్లా కలెక్టర్ హరీస్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని జరగాలని ఆశిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.