భోపాల్: కొందరు దొంగలు ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను నిద్ర లేపి తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు తీసుకున్నారు. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు దోచుకున్నారు. (Thieves Loot Bizman) మధ్యప్రదేశ్‌లోని పాంధుర్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున సౌసర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలోని పత్తి వ్యాపారి ఇంట్లోకి ముసుగులు ధరించిన ఏడుగురు దొంగలు చొరబడ్డారు. వంట గదిలోని కిటికీ గ్రిల్‌ను కట్ చేసి లోనికి ప్రవేశించారు. బిజినెస్ మ్యాన్ రాజేంద్ర, అతడి భార్య కల్పనను నిద్ర లేపారు. వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఆ దంపతులను తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా తమను ఏమీ చేయవద్దని ఆ వ్యాపారి భార్య దొంగలను వేడుకుంది. ప్రాణ భయంతో లాకర్ తాళాలు వారికి ఇచ్చింది. దీంతో ఆ వ్యాపారి ఇంట్లో ఉన్న రూ. 22 లక్షల విలువైన 20 తులాల బంగారు నగలు, కిలో వెండి ఆభరణాలు, రూ.25,000 నగదు దోచుకున్నారు. ఆ వ్యాపారి ఇంటి సమీపంలో పార్క్ చేసిన రెండు బైకుల్లో ఆరుగురు వ్యక్తులు పారిపోయారు. ఒక వ్యక్తి అక్కడ ఉండిపోయాడు.
మరోవైపు వ్యాపారి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌కు చెందిన ‘చడ్డీ, బనియన్ గ్యాంగ్’ ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ ఉండి పోయిన వ్యక్తి స్థానికుడు కావచ్చని భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.