భోపాల్: ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో ఉంచిన యువతిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. (Men Abduct Girl) మహిళా గార్డు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది నిద్రించగా అర్ధరాత్రి వేళ ఈ చర్యకు పాల్పడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముఖానికి ముసుగులు ధరించిన ఆరుగురు యువకులు గ్వాలియర్‌లోని బాలికల షెల్టర్ హోమ్‌లోకి ప్రవేశించారు. నాలుగు అడుగుల ఎత్తైన గోడ నుంచి దూకి లోనికి వెళ్లారు.
కాగా, సెక్యూరిటీ గార్డు గది కిటికీలోంచి కర్ర ద్వారా తాళం చెవి పొందారు. షెల్టర్ హోమ్ ముందు తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. ఒక గదిలో ఉన్న 17 ఏళ్ల యువతిని నిద్ర లేపారు. ఆమెను బయటకు తీసుకువచ్చారు. ఆ యువతి ప్రతిఘటించక పోవడంతో వారంతా ఆమెకు తెలిసిన వ్యక్తులుగా తెలుస్తున్నది. అనంతరం ఆ యువతితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళా గార్డు, మరో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఒక పోలీసు అధికారి ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ యువతి కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయిందని తెలిపారు. జూన్ 7న ఆమెను గుర్తించి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. పేరెంట్స్‌తో వెళ్లేందుకు ఆమె నిరాకరించిందని అన్నారు. దీంతో కోర్టు ఆదేశాలతో ఆ యువతిని షెల్టర్ హోమ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
కాగా, అక్కడి నుంచి తప్పించుకునేందుకు గతంలో కూడా ఆ యువతి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. యువతిని షెల్టర్ హోమ్ నుంచి తప్పించేందుకు ఆమె ప్రియుడు ప్లాన్ వేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో యువతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు షెల్టర్ హోమ్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | CCTV Footage: Six Masked Men Abduct 17-Year-Old Girl In Middle Of The Night From Shelter Home In Gwalior #MPNews #MadhyaPradesh pic.twitter.com/zUtU4KJ23C
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 21, 2024