భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 7న జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఐదు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటుకున్న సర్పంచులను అభినందించే కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి బైక్‌లపై ర్యాలీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లు, ముఖ్యులు రావాలన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించామన్నారు.
ఈ మంచి సానుకూల వాతావరణంలో అందరం కలిసికట్టుగా కృషిచేసి మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల్లో గులాబీజెండాను ఎగురవేయాలన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సర్పంచులుగా గెలిచిన వారికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, భద్రాచలం ఇన్చార్జి మానె రామకృష్ణ, రాంప్రసాద్, జిల్లా మహిళా నాయకురాలు సింధుతపస్వి, అన్వర్‌పాషా, మంతపురి రాజుగౌడ్, సున్నం నాగమణి, బాదావత్ శాంతి, అన్ని మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.