న్యూఢిల్లీ: గ్రహాలకు సంబంధించిన రెండు అద్భుతాలు ఈ నెల, వచ్చే నెలలో జరగనున్నాయి. వీటిలో ఒకటి 400 ఏండ్లకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం. ఈ నెల 17, 18 తేదీల్లో రాత్రి వేళ ఆకాశంలో చూసినపుడు ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. దీనిని గ్రహాల కవాతు అని ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.
కుజ, గురు, నెప్ట్యూన్, శని, యురేనస్, శుక్ర గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. వీటిలో నెప్ట్యూన్, యురేనస్ బైనాక్యులర్స్, టెలిస్కోపు ద్వారా మాత్రమే కనిపిస్తాయి. ఫిబ్రవరి 28న ఏడు గ్రహాలు వరుసగా కనిపిస్తాయి. ఇటువంటి సందర్భం మళ్లీ 2492వ సంవత్సరంలో మాత్రమే వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.