న్యూఢిల్లీ, జూలై 3: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఓ సంచలనంగా మారింది. దీనిని మించిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)పై ఇప్పుడు పరిశోధనలు ముమ్మరమయ్యాయి. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ ఏజీఐని అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న చురుకైన సిబ్బందిని ఎంత మొత్తమైనా చెల్లించి చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.
ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, డీప్‌మైండ్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రముఖ ఏఐ పరిశోధకులకు నాలుగేండ్ల కాంట్రాక్టుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2564 కోట్లు) చెల్లించేందుకు సిద్ధపడినట్టు బ్లూమ్‌బర్గ్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలు వెల్లడించాయి. వీరికి ప్రారంభ బోనస్‌గా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.850 కోట్లు) ఆఫర్ చేసినట్టు తెలిపాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన త్రపిట్ బన్సల్ మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లో చేరారు. ఐఐటీ కాన్పూర్ నుంచి పట్టభద్రుడైన బన్సల్ గణితం, స్టాటిస్టిక్స్‌లో రెండు డిగ్రీలు పొందారు.
ఆ తరువాత మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు. యాక్సెంచర్ సంస్థలో అనలిస్ట్‌గా 2012లో చేరిన ఆయన ఐఐఎస్సీ బెంగళూరులో రెండేండ్ల పాటు రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐలో ఇంటర్న్‌గా పనిచేశారు. 2022లో ఓపెన్ ఏఐ సంస్థలో పూర్తిస్థాయి టెక్నికల్ సిబ్బందిగా చేరారు. అక్కడే ఆయన చాట్‌జీపీటీ ఇంటర్నల్ రీజనింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. తాజాగా మార్క్ జుకర్‌బర్గ్ ప్రారంభించిన మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో చేరారు. అయితే జుకర్‌బర్గ్ ఆయనకు ఎంత ప్యాకేజీని ఖరారు చేశారన్నది ఇంకా వెల్లడి కాలేదు. నాలుగేండ్ల కోసం 300 మిలియన్ డాలర్లకన్నా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు.