న్యూఢిల్లీ: ప్రేమను ప్రదర్శించేందుకు మాటలే అక్కర్లేదు.. చేతల ద్వారానూ దానిని బయటపెట్టొచ్చు. సరిగ్గా అదే చేశారు ఫేస్బుక్ బాస్, మెటా బిలియనీర్ మార్క్ జుకర్‌బర్గ్. భార్య ప్రిస్కిల్లా చాన్ విగ్రహాన్ని చెక్కించి ఇంటి పెరట్లో ప్రతిష్ఠించి ఆమెపై తనకున్న ప్రేమను చాటిచెప్పారు. పూర్తి నీలం రంగులో ఉన్న విగ్రహం ఒంటిపై వెండిరంగులో ఉన్న వస్త్రం గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. అత్యద్భుతంగా ఉన్న ఈ విగ్రహాన్ని న్యూయార్క్‌కు చెందిన డేనియల్ అర్షమ్ రూపొందించారు. ఈ విగ్రహం చెంత నిల్చుని కాఫీ తాగుతున్న ప్రిస్కిల్లా ఫొటో, విగ్రహం వీడియోను జుకర్‌బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ‘భార్య విగ్రహాన్ని చెక్కే రోమన్ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చాం. థ్యాంక్యూ డేనియల్ అర్షమ్’ అని దానికి క్యాప్షన్ తగిలించారు. హార్వర్డ్‌లోని ఓ కాలేజీ పార్టీలో 2003లో కలుసుకున్న జుకర్‌బర్గ్-ప్రిస్కిల్లా 12 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.