తిరువనంతపురం: ఆలయ ప్రాంగణంలో గంజాయి మొక్కలు చూసి సిబ్బంది షాకయ్యారు.
ఎక్సైజ్ శాఖ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. గంజాయి మొక్కలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. (Marijuana Plants In Temple) కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ థండర్’ను ఎక్సైజ్ శాఖ చేపట్టింది. ఇందులో భాగంగా అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, వకతనం వద్ద ఉన్న మణికండపురం శ్రీ కృష్ణ స్వామి ఆలయ ప్రాంగణంలోని నడక దారి వద్ద రెండు గంజాయి మొక్కలను ఆలయ సిబ్బంది గుర్తించారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ-నార్కోటిక్ స్పెషల్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ దర్శక్ ఆర్ నేతృత్వంలోని బృందం ఆలయానికి చేరుకున్నది. ఆ గంజాయి మొక్కలను పెకలించి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మే నెలలో జరిగిన ఆలయ ఉత్సవాల సమయంలో ఎవరో ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలో గంజాయి సేవించి అవశేషాలను అక్కడ పడేసి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అవశేషాల నుంచి గంజాయి మొక్కలు మొలకెత్తినట్లు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వెల్లడించారు.