జాల్నా, జనవరి 20: తన ఆఖరి శ్వాస వరకు మరాఠాల రిజర్వేషన్ల కోసం పోరాడుతానని మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ జరాంగే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబై వరకు నిర్వహించే నిరసన ర్యాలీని వేలాదిమంది మద్దతుదారులతో శనివారం ఆయన జాల్నాలో ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ మరాఠాలకు రిజర్వేషన్ల కల్పనలో విఫలమైన సీఎం షిండే ప్రభుత్వ క్రూర, కఠిన వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.
రిజర్వేషన్లు కల్పించాలని తాము ప్రభుత్వానికి ఏడు నెలల సమయమిచ్చామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు కల్పించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, తన ఆఖరి శ్వాసవరకు దీనిపై పోరాటం చేస్తానని జరాంగే ప్రమాణం చేశారు. మరాఠా యువత ప్రాణాలు కోల్పోతున్నా ఇంత క్రూరంగా, దయ లేకుండా ప్రభుత్వం ఎలా ఉంటున్నదని ఆయన ప్రశ్నించారు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌పై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. రాష్ట్ర బీసీ కమిషన్‌తో జనవరి 23 నుంచి సర్వే చేపడతామని, మరాఠా సామాజికవర్గంలో సామాజిక, ఆర్థిక వెనుకబాటును అంచనావేస్తామని శనివారం ప్రకటించారు.