జాల్న, మే 11: తమకు రిజర్వేషన్లు నిరాకరించడమే కాక, దాని కోసం ఆందోళన చేస్తున్న వారిని కేసులు, అరెస్టులతో వేధిస్తున్న మహారాష్ట్రలోని మహాయుత్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో మరాఠా సామాజిక వర్గం తగిన విధంగా బుద్ధి చెబుతుందని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం గత ఏడాది ఆందోళన చేసిన ఉద్యమకారులపై ఎందుకు కేసులు నమోదు చేశారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో మద్దతుపై తమ వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తమ సామాజిక వర్గం ఐక్యత, పోరాటం కారణంగానే ఓటమి భయంతో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ వారిపై శివసేన-బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని, ఈ ఎన్నికల్లో అది తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి వైఖరిపైనా జరాంగే ఆగ్రహం వ్యక్తం చేశారు.