బీజాపూర్: ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు (Maoists) మరో వ్యక్తిని హత్యచేశారు. మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లాలో మరొకరని హతమార్చారు. భైరాంఘడ్ పరిధి జైగూర్లో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. సీతూ మండావి అనే వ్యక్తిని హత్యచేశారు. అతడు పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని చెప్పారు.
కాగా, ఈ నెల 22న బంటి రాధను ఇన్ఫార్మర్ నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపుర అటవీ ప్రాంతంలో చంపేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బాలాజీనగర్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన రాధ ఇంటర్ వరకు చదివి డీఎంఎల్టీ పూర్తిచేసింది. ఆ సమయంలో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నేతలతో పరిచయం ఏర్పడింది. అనంతరం 2018లో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆరేండ్ల పాటు ఏవోబీలో కొనసాగారు. అయితే మూడు నెలల క్రితం క్రమశిక్షణ చర్యల కింద పార్టీ కమాండర్ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. కోవర్టుగా మారినందుకు రాధను తామే చంపేశామని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ ప్రకటించారు.