నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/చండూరు/కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా అడవుల్లో బుధవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే(69) మృతిచెందారు. కంధమల్-గంజామ్ జిల్లాల సరిహద్దు చకపాడా సమీపంలోని రంభా ఫారెస్ట్ రేంజ్ పరిధిలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో హన్మంతుతోపాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హన్మంతు స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. ఆయనపై రూ.1.1 కోట్ల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పాక పాపమ్మ-చంద్రయ్య దంపతులకు 1961లో హన్మంతు జన్మించారు. ఆయనకు ముగ్గురు చెల్లెండ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పుల్లెంలలో ఆయన పుట్టిన ఇల్లు పడావు పడింది. ఆయన ఒక సోదరుడు నల్లగొండలో నివాసం ఉంటుండగా సోదరీమణులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. హన్మంతు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సు చదివారు. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు.
1982లో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో కాలేజీలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేతలతో జరిగిన విద్యార్థి సంఘాల గొడవల్లో హన్మంతు కీలక పాత్ర వహించినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1980లో నల్లగొండలో జరిగిన ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి వెనుదిరిగి చూడలేదు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతగా పేరొందారు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఎన్నో ప్రధాన ఘట్టాల్లో కీలక పాత్ర పోషించారు.