రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్‌నగర్-మహమ్మద్‌గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని చెప్పారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌తోపాటు భారీగా ఆయుధాలు స్వాధినం చేసుకున్నామని వెల్లడించారు.
కాగా, జార్ఖండ్‌లోని లాతహోర్‌లో సోమవారం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు సభ్యుడు మనీశ్ యాదవ్ మృతిచెందాడు. అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నదని అధికారులు వెల్లడించారు. రూ.10 లక్షల రివార్డున్న పార్టీ జోనల్ కమాండర్ కుందన్ సింగ్ ఖర్వర్‌ను అరెస్టు చేశామని తెలిపారు.