కొత్తగూడెం ప్రగతి మైదాన్ : భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సొరేన్తోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఘండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పంతిత్రి అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే జవాన్లు మూడు దిక్కుల నుంచి చుట్టుముట్టి ఎదురుకాల్పులకు దిగారు.
జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు విడతల వారీగా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, వారి ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో రూ. కోటి రివార్డు ఉన్న సహదేవ్ సొరేన్, రూ.25 లక్షల రివార్డు కలిగిన జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్బ్రమ్ అలియాస్ చంచల్, రూ.10 లక్షల రివార్డు ఉన్న జోనల్ కమిటీ సభ్యుడు భైర్సెన్ ఘంజూ అలియాస్ రామ్ఖెలవన్ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.