Maoists : ఇప్పటికే ఆపరేషన్ కగార్ (Operation Kagar) తో కకావికలమైన మావోయిస్టుల (Maoists) కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా (Sukma district) లోని మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. దాంతో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కుట్రను భగ్నంచేశారు. సుక్మా జిల్లా మీనాగట్టా (Meenagatta) అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలతోపాటు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు నిర్వహిస్తున్న ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతాబలగాలు గుర్తించాయి. అందులో భారీ ఎత్తున ఉన్న ఆయుధాలను, సింగిల్ షాట్ రైఫిల్స్‌ను, డిటోనేటర్లను, భారీ పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అలాగే భద్రతాదళాలే లక్ష్యంగా బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్‌ను సైతం వారు పేల్చేశారు. 2026 మార్చి నెల ఆఖరులోపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
అందుకోసం మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలతోపాటు ఆ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. అలాగే వందల సంఖ్యలో మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఇక జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.