Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పరిణామాలకు ఆయనను తప్పుపట్టలేమని, చాలా అంశాలు ఆయన నియంత్రణలో ఉండవని అన్నారు.
మహాకూటమిలోని ఆర్జేడీ మిత్రపక్షాలన్నీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఎప్పుడూ గౌరవిస్తాయని చెప్పారు. వేదికలపైన ఎప్పుడూ ఆయన నా పక్కనే కూర్చునే వారని, ‘2005కు ముందు బీహార్ ఎలా ఉండేది..?’ అని అడిగేవారని తెలిపారు. కానీ తాను ఎప్పుడూ ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్నారు. ‘ఇప్పుడు చెబుతున్నా.. గత రెండు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని తాము అతి తక్కువ కాలంలో చేసి చూపించాం’ అని చెప్పారు.
ఉద్యోగాలు కల్పించామని, కుల గణన నిర్వహించామని, రిజర్వేషన్లు పెంచామని, ఇంకా ఎన్నో పనులు తమ పాలనలో జరిగాయని తేజస్వియాదవ్ తెలిపారు. బీహార్ ప్రస్తుతం నడుస్తున్నదని ఒక ఆట తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు.