Uddhav Thackeray | చాలా రోజుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే యాక్టివ్ అయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా కొన్ని రోజుల పాటు ఆయన సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆయన సమావేశాలకు హాజరవ్వడం ప్రారంభించారు. అయితే తాజాగా… శనివారం బీజేపీపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొందరు ఎన్నికల సమయంలో లేనిపోని హామీలనిచ్చి, ఎన్నికల తర్వాత మరిచిపోతారని పరోక్షంగా బీజేపీని దెప్పిపొడిచారు. శివసేన మాత్రం వాళ్లలాగ కాదని స్పష్టం చేశారు.
‘చందమామను కిందికి తీసుకొస్తామని, నక్షత్రాలను కిందికి తెస్తామని… ఇలా ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలిస్తారు. ఎన్నికలు అయిపోగానే మరిచిపోతారు. చందమామను, నక్షత్రాల్ని తెచ్చిస్తారని ఎన్నికల సమయంలో హామీఇచ్చారుగా అని ప్రశ్నిస్తే.. అది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అని నెమ్మదిగా జవాబిస్తారు. శివసేన వారిలాగా కాదు’ అని ఉద్ధవ్ థాకరే తేల్చి చెప్పారు. తాము మాత్రం తప్పుడు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయమని, వారు మాత్రం కేవలం ఎన్నికల్లో గెలవడానికే తప్పుడు హామీలిస్తారని సీఎం ఉద్ధవ్ తీవ్రంగా మండిపడ్డారు.