న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో తొలిసారిగా బీహార్‌కు చెందిన ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. బీహార్‌లోని భాగల్పూర్ అనే గ్రామానికి చెందిన మన్వీ మధు కశ్యప్ ఈ ఘనత సాధించారు. మన్వీ సహా ముగ్గురు ట్రాన్స్జెండర్లను సైతం బీహార్ ప్రభుత్వం ఎస్ఐలుగా ఎంపిక చేసింది. వారిలో ఇద్దరు పురుషులు కాగా, మన్వీ మధు ఏకైక మహిళా ట్రాన్స్‌జెండర్.
మంగళవారం వెలువడిన ఎస్ఐ పరీక్షా ఫలితాల్లో తాను ఎంపికవ్వడంతో మధు ఆనందానికి అవధులు లేవు. ‘దీనికోసం నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇప్పుడు వాటి ఫలితం కన్పించింది. నన్ను విద్యాసంస్థల్లో చేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ వారు ఇష్టపడలేదు. నేనుంటే అక్కడి వాతావరణం కలుషితమవుతుందని వారు భయపడ్డారు. ఈ విజయంతో నా లక్ష్యాన్ని సాధించా. నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే నేనీ రోజు ఇక్కడ ఉన్నా’ అని మన్వీ ఉద్వేగంతో పేర్కొన్నారు.