Bulldoze @ MP | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనుసరిస్తున్న కఠిన విధానాలు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒంటబట్టినట్లున్నాయి. ఏదేని సంఘ వ్యతిరేక కార్యకలాపం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఇళ్లను కూల్చివేస్తున్న యూపీ ప్రభుత్వం మాదిరిగానే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన యువకుడి వీడియోపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపించిన వ్యక్తి ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేసింది.
రేవా జిల్లాలోని ధేరా గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి అనే 19 ఏండ్ల యువకుడు తనను పెండ్లి చేసుకోవాలంటూ అడిగిన యువతిని చితకబాదిన వీడియో ఒకటి రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి రావడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సదరు యువకుడికి చెందిన ఇల్లు అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ బుల్డోజర్లతో కూల్చివేశారు.
మిర్జాపూర్‌లో శనివారం రాత్రి పంకజ్ త్రిపాఠిని అరెస్ట్ చేసినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘నేరస్థుడు వృత్తిరీత్యా డ్రైవర్. అందుకని ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశాం. అతడి ఇల్లు కూడా అక్రమంగా నిర్మించాడని తేలడంతో ఆ ఇంటిని కూల్చివేశాం. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై మౌగంజ్ పీఎస్ టీఐని సస్పెండ్ చేశాం’ అని సీఎం తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరినీ వదిలిపెట్టం అని సీఎం హెచ్చరించారు.