న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌పై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. సెప్టెంబర్ 18 నుంచి జరిగే స్పెషల్ సెషన్ అజెండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మినహా ఎవరికీ తెలియదని అన్నారు. ఇదే మోదీ సర్కార్ నయా పారదర్శకతని మనోజ్ ఝా ఎద్దేవా చేశారు.
ఇది సాధారణ సమావేశం కాదని, స్పెషల్ సెషన్ అని ఇంతకుముందు ఇలా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే దాని ఉద్దేశం అందరికీ తెలిసేదని, కానీ ఇప్పుడిదే నూతన పారదర్శకతని ఆర్జేడీ ఎంపీ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల గురించి ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అజెండా వివరాలను వెల్లడించాలని విపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.
పార్లమెంట్ సెషన్స్‌పై రహస్యం ఏముంటుందని నిలదీస్తున్నాయి. ప్రత్యేక సెషన్ అజెండాను వెల్లడించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ధరల మంట, నిరుద్యోగం, మణిపూర్ హింస సహా తొమ్మిది కీలక అంశాలపైనా చర్చకు సమయం కేటాయించాలని లేఖలో ఆమె కోరారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు చేపట్టకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారని, సమావేశాల అజెండా కూడా తమకెవరికీ తెలియదని లేఖలో ప్రస్తావించారు.
Read More :