ముంబై , నవంబర్ 4( నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్.. సోమవారం అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపడం లేదని ప్రకటించారు. జరాంగే యూటర్న్ తీసుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందోనని వాదనలు మొదలయ్యాయి. జరాంగే సోమవారం ఉదయం అంతర్వాలి సారథి గ్రామంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలపరాదని నిర్ణయించినట్లు తెలిపారు. ఎవరిని ఓడించాలో, ఎవరిని గెలిపించాలో మరాఠాలే నిర్ణయిస్తారన్నారు. తాను ఏ అభ్యర్థికి కానీ, రాజకీయ పార్టీకి కానీ అనుబంధంగా లేనని, మద్దతివ్వడం లేదని చెప్పారు. ఎంవీఏ, మహాయుతి నేతల నుంచి తనపై ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.